– సీఎం అవినీతి సొమ్ము కక్కిస్తాం..
– కేసీఆర్ ఫ్లెక్సీల్లో ఉంటే..
– మోడీ జనం గుండెల్లో ఉన్నారు
– బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేరు
– కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్‌ఎస్ కు వేసినట్లే..
– కేటీఆర్ ఢిల్లీ టూరే అందుకు నిదర్శనం
– కేసీఆర్ పై ఈటల ఫైర్
తెలంగాణలో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కేసీఆర్.. దేశ రాజకీయాల్లో ఏం వెలగబెట్టేందుకు తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హన్మకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
బీజేపీ ప్రభంజనాన్ని ఆపడం కేసీఆర్ జేజమ్మ వల్ల కూడా కాదన్నారు ఈటల. టీఆర్ఎస్ ను పాతరేసి, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని.. ఆయనో పెద్ద అబద్దాలకోరని విమర్శించారు. ప్రజల చెమట బిందువులను దోచుకు తిన్న కేసీఆర్ తత్వమేంటో జనాలకు అర్థమైందని అన్నారు.
టీఆర్ఎస్ ఆరిపోయే దీపమని.. కేసీఆర్ రాజకీయ జీవితానికి కాలం చెల్లిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్న ఆయన.. కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదని ఫైరయ్యారు. హుజూరాబాద్ లో తనను ఓడించేందుకు అమలుచేసిన దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు అసహ్యించుకుంటున్నా కూడా రూ.33 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకున్నారని.. కేసీఆర్ ఫ్లెక్సీల్లో ఉంటే.. మోడీ జనం గుండెల్లో ఉన్నారని చెప్పారు ఈటల. బుడ్డపార్టీ టీఆర్ఎస్ కు బీజేపీని ఆపే శక్తి లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్‌ఎస్ కు వేసినట్లేనన్న ఈటల.. రాహుల్ గాంధీ, కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే అందుకు నిదర్శనమని విమర్శించారు.