- తెలంగాణలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్..
- గెలుపే లక్ష్యంగా సరికొత్త స్ట్రాటజీ
- కేసీఆర్ పై ప్రతీకారానికి ‘ఈటల’నే అస్త్రమా..?
- ఈటలకు కొత్త బాధ్యతలు పార్టీకి ఎంతవరకు మేలు..?
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతుంటే.. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం అధికారం దక్కించుకునేందుకు తహతహలాడుతున్నాయి. ముఖ్యంగా బిజెపి ఒక అడుగు ముందుకేసి ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తోంది. తాజాగా జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు సహా ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాషాయ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనపడుతోంది. అయితే ఇదే తరుణంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మూడు కీలక కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు కట్టబట్టడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో రోజురోజుకు బలం పుంజుకుంటూ అధికారం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న బిజెపి… వైరిపక్ష పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు కోసం నియమించిన ఈ మూడు కమిటీలే అమృత బాండాగారంగా బిజెపి భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బిజెపి అధిష్టానం సైతం ఫోకస్ పెట్టడమే కాకుండా, జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలను నియమించింది.
కేసీఆర్ పై ప్రతీకారానికి ఈటలనే అస్త్రంగా బిజెపి భావిస్తోంది. బిజెపిలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అప్పగించారు. ఈమేరకు కమిటీ కన్వీనర్ గా ఆయనను నియమించారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు అయిపోగానే ఈటలకు పదవి ఇచ్చారు. కొంత కాలంగా తెలంగాణ బిజెపిలో ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు చేరికలను చూసుకునే బాధ్యతను అప్పజెప్పారు. అయితే ఇదొక అగ్ని పరీక్షగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ నుంచి ఎంతమంది నాయకులను బిజెపిలోకి తీసుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
రాష్ట్రంలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి బిజెపి అభ్యర్థులు కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బిజెపికి జవసత్వాలు నింపి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చేలా ఈటల రాజేందర్ ను వినియోగించుకోవాలనే వ్యూహంతో బిజెపి అధిష్టానం పావులు కదుపుతోంది. తాజాగా జరిగిన బిజెపి పదాధికారుల సమావేశంలో పార్టీ బలోపేతం కోసం కార్యాచరణను రూపొందించిన కీలక నేతలు.. మొత్తం 119 నియోజకవర్గాల్లో సంపర్క్ యోజన పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయా నియోజకవర్గాలను క్లస్టర్ లుగా విభజించి.. కేంద్రమంత్రులను ఆ క్లస్టర్లకు ఇంచార్జ్ లుగా నియమించింది. అంతేగాక, పార్లమెంటు ప్రవాస్ యోజన తయారీపై చర్చతో పాటు భవిష్యత్ కార్యక్రమాలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.
రాజకీయ పార్టీల్లో నాయకుల చేరికలు సెంటిమెంట్‌ను పెంచుతాయి. అందుకే.. చేరికల్ని బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈటల మాత్రమే ఆయా పార్టీల నుంచి బిజెపిలో చేర్పించగలరని బిజెపి విశ్వాసంతో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రం మొత్తం మీద ఈటలకు కొంతవరకు పట్టుంది. ఉద్యమకారుల్లో ఆయనకు ఎంతో పేరుంది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించాలని ఈటలకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారమే లక్ష్యంగా బిజెపి దూకుడు పెంచడంతో పాటు రాష్ట్రంలో శక్తివంతమైన టీఆర్ఎస్ ను ఢీకొట్టిన ఈటల రాజేందర్ ను ఎన్నికల కార్యాచరణలో వినియోగించుకునేందుకు సిద్ధమైంది.