దేశంలో మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16 న, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27 న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. మార్చి 2 న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో..త్రిపురలో మాణిక్ సాహా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది.
విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించామని రాజీవ్ కుమార్ తెలిపారు. త్రిపురకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 21 న జారీ అవుతుందని, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ అని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2 చివరితేదీగా వివరించారు. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు జనవరి 31 న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 7 చివరి తేదీ అని పేర్కొన్నారు.
నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చి 12 తోను, మేఘాలయ మార్చి 15 తోను, త్రిపుర అసెంబ్లీ కాల పరిమితి మార్చి 22 తోను ముగియనుంది. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 1.76 లక్షల మంది మొదటిసారిగా ఓటింగ్ లో పాల్గొనబోతున్నారని రాజీవ్ కుమార్ వివరించారు. తమ బృందం ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించిందని, ఎన్నికల సన్నాహాలకు సంబంధించి సమీక్షా సమావేశాలను నిర్వహించిందని ఆయన చెప్పారు.
మేఘాలయలో 5 గురు ఎమ్మెల్యేల రాజీనామాలు
మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించడానికి ముందే మేఘాలయాలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరు యునైటెడ్ డెమాక్రాటిక్ పార్టీలో చేరనున్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి, ఒకరు తృణమూల్ కాంగ్రెస్ కి, ఒకరు హిల్ స్టేట్ పీపుల్స్ డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు కాగా ఒకరు ఇండిపెండెంట్ సభ్యుడు.