ఐదురాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. కొన్ని పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. మరికొన్ని పార్టీలు ఉనికిని కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నాయి. కొత్త పుంతలు తొక్కుతూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాయి.
అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నా.. ఈ కరోనా పుణ్యమా అని ప్రచారంలో ఒకప్పటి కళ కనిపించడం లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రచారం మొత్తం డిజిటల్ గానే జరుగుతోంది. వేల మంది జనాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, సౌండ్స్, కట్ అవుట్స్ లేవు. దీంతో.. తెలియని లోటు కనిపిస్తోంది.
అయితే.. తాజాగా ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. బహిరంగ సభలకు, ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలలో వెయ్యి మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అనుమతించింది. ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంచింది. ఇంతకు ముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది. ఇండోర్లో 500 మంది వ్యక్తులతో ఎన్నికల సభ నిర్వహించడానికి మినహాయింపు కల్పించింది.
Advertisements
మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కించనున్నారు.