గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఈసీ శుక్రవారం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరాంతంలో ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ శాసన సభ కాల పరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 తో ముగియ నుండగా, హిమాచల్ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే జనవరి 8 నే ముగియనుంది. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీకి 2017 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో కూడా . 2017 నవంబరులో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 68 స్థానాలున్నాయి. బహుశా ఈ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ ఇటీవలి కాలంలో తరచూ వీటిని విజిట్ చేస్తూ వరాలు కురిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆయన హడావుడిగా ప్రాజెక్టులకు ప్రారంభొత్సవాలు, శంకుస్థాపనలు చేయడం వెనక ఉన్న మర్మమిదేనని హిమాచల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రతిభా సింగ్ అన్నారు.
2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి ఘన విజయం సాధించాలంటే మోడీకి ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల్లో పార్టీ విజయ సాధన ముఖ్యం. అందువల్లే ఈ రాష్ట్రంలో బీజేపీ నేతల ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.
అటు ఇక్కడ కూడా తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఈ వారంలో మోడీ రెండు సార్లు గుజరాత్ ని సందర్శించి వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గత నెలలో ఈ రాష్టాన్ని విజిట్ చేసి రాష్ట్ర అధికారులతోను, పార్టీల నేతలతోనూ సమావేశాలు జరిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాల గురించి వారితో చర్చించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్లు 12 జిల్లాల అధికారులతోను, పోలీసు అధికారులతోను చర్చలు జరిపారు.