యూపీ ఓటర్లకు సంబంధించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. ఈసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన మాటలు ఓటర్లను బెదిరించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
యూపీలో ఉండాలనుకుంటే యోగికి ఓటు వేయాల్సిందేనని అన్నారు రాజాసింగ్. బీజేపీకి ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ విషయాన్ని బాగా హైలెట్ చేసింది. మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ.. బీజేపీలో మరో అద్భుతమైన హాస్యనటుడు బయటపడ్డారని సెటైర్లు వేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ను ట్విట్టర్ మ్యాన్ అని అభివర్ణించారు.
తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు రాజాసింగ్. అసెంబ్లీలో మాట ఇచ్చి.. బయట అబద్దాలు చెప్పేది ఎవరో చూస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. యూపీలో యోగి సర్కార్ వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తాను మాఫియా వాళ్లను, అక్రమార్కులను మాత్రమే హెచ్చరించానని.. అందర్నీ అన్నట్లుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు పని లేదని.. సోషల్ మీడియాలో బీజేపీ బురద జల్లించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. దేశ ద్రోహ్రులు, ధర్మ ద్రోహ్రుల ఇళ్లను ముమ్మాటికీ బుల్డోజర్లతో కూల్చేస్తామని మరోసారి స్పష్టం చేశారు రాజాసింగ్.
అయితే.. రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని 24 గంటల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది.