యూపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే.. రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. మీడియాతో మాట్లాడటంపైనా నిషేధం విధించింది ఈసీ.
యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చింది. అయితే.. ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు రాజాసింగ్. అందులో ఎన్నికల తర్వాత యోగికి ఓటేయని వారిని గుర్తించి వారి ఇళ్లను బుడ్జోజర్లతో కూలుస్తామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఈసీ నోటీసులు ఇచ్చింది.
ఈసీ నోటీసులపై వెంటనే స్పందించిన రాజాసింగ్.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కావాలని రాజస్థాన్ ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఈసీకీ వివరణ ఇస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఎన్నికల సంఘం.