ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ప్రముఖ శుభదీప్ సింగ్ సిద్ధూ( సిద్ధూ మూసేవాలా)పైన అధికారులు కేసులు నమోదు చేశారు.
మాన్సాలో ఉన్న ఓ ఆలయాన్ని శుభదీప్ తో కలిసి సీఎం చన్నీ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత సీఎం చన్నీ , శుభదీప్ లు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎన్నికల అధికారులు స్పందించారు. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అయితే సీఎం చన్నీ మాన్సాలో ఓటరు కాదన్న విషయాన్ని ఎన్నికల అధికారులు గుర్తించారు.
మాన్సాలో ఓటు హక్కు లేనప్పటికీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు తెలిపారు. అందుకే ఆయనపై కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. సిద్దూ మూసేవాల సైతం 500 మంది మద్దతు దారులతో ప్రచారం నిర్వహిస్తున్నారని, ఎన్నికల నియమాలు ఉల్లంఘించినందుకు ఆయనపైనా కేసు పెడుతున్నట్టు వివరించారు.