వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది. మద్యం, చికెన్ పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజనాలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ ను వివరణ కోరింది. శ్రీహరికి కూడా నోటీసులు పంపించింది.
దసరా రోజున జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్ ఆ సమయంలో రాజనాల శ్రీహరి కాస్త అత్యుత్సాహం చూపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తూ కోళ్లు, మద్యం పంపిణీ చేశారు. అంతేకాదు.. జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు కావాలని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించాలని అన్నారు.
కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని.. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కేటీఆర్ ఎంపిక అయి.. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు శ్రీహరి. ఈ విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని పూజల అనంతరం.. 200 మంది హమాలీలకు ఒక కోడితోపాటు మద్యం బాటిల్ పంపిణీ చేశారు.
అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈసీ దాకా ఇది చేరింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని నోటీసులు వచ్చాయి.