రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ముందు ప్రజలకు ఇవి ఇస్తున్న హామీలను ఎలా నెరవేరుస్తాయో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు చేస్తున్నారని, వీటి అమలుకు ఎక్కడి నుంచి నిధులు అందుతాయో వివరించాలని కోరింది. ఎన్నికల హామీలమీద క్లారిటీ లేని అంశాలను తాము వదిలివేయజాలమని దాదాపు హెచ్చరించింది. ఉచితాలకు ఎక్కడి నుంచి మీకు నిధులు అందుతున్నాయి ? ఉచిత హామీలు ఎలా అమలు చేస్తున్నారు ? మీ వాగ్దానాలకు ఆర్థికంగా ఏ మూలాల నుంచి సొమ్ము అందుతోందో ఓటర్లకు సరైన, నిజాయితీతో కూడిన సమాచారం ఇవ్వండి అని ఈసీ కోరింది.
ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిబధ్ధతతో నిర్వహించాల్సి ఉంది.. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోంచుకునేలా చూడాల్సి ఉంది.. అర్హులైన ఓటర్లందరికీ .ఎలెక్షన్స్ నిర్వహించగలిగే ఎన్నికల వ్యవస్థ అవసరం అని ఈసీ అభిప్రాయపడింది.
సిస్టమాటిక్ ఫ్లో అన్నది ఎంతైనా ఆవశ్యకమని, ప్రతి ఎన్నికల దశలోనూ ఓటర్లకు సరైన, తగినంత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. ‘ఉచితాల’ సమస్యపై డిబేట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఉచిత’ సంస్కృతి వివాదం చివరకు సుప్రీంకోర్టుకు కూడా ఎక్కింది. . ఉచిత హామీల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థకు నిధుల కొరత ఏర్పడుతోందని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అభిప్రాయపడింది.
రాజకీయ పార్టీలు తప్పుడు హామీలిస్తున్నాయని, ఇది అవాంఛనీయ ప్రభావం చూపుతోందని ఈసీ పేర్కొంది. పార్టీలు మేనిఫెస్టోలను రూపొందించడం వాటి హక్కని తాము సూత్రప్రాయంగా భావిస్తున్నామని, కానీ కొన్ని అవాంఛనీయ హామీల ప్రభావాన్ని తాము మదించకుండా వదిలిపెట్టజాలమని స్పష్టం చేసింది, కల్లబొల్లి హామీలు, ఆచరణ సాధ్యం కానివి దుష్పరిణామాలకు దారి తీస్తాయని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులు తామిచ్చే హామీలకు ఎక్కడి నుంచి నిధులు అందుతాయో వివరించాలి.. వీరి డిక్లరేషన్లు రొటీన్ గా, సందిగ్ధంగా ఉంటున్నాయని, ఓటర్లకు తగినంత సమాచారం ఇస్తున్నట్టు లేదని ఈసీ అభిప్రాయపడింది. ఈ నెల 18 లోగా అన్ని పార్టీలు దీనికి స్పందించాలని ఈ లేఖలో కోరింది.