దేశంలో ఇప్పటి వరకు 400 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, 17 పార్లమెంటరీ, 16 సార్లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అయినప్పటికీ ప్రతి ఎన్నికల తర్వాత ఈసీఐ ప్రతిసారీ ‘అగ్నిపరీక్ష’ఎదుర్కొంటోందన్నారు.
కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తున్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత 70 సంవత్సరాలలో, భారతదేశం తన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, భాషాపరమైన సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా స్థిరీకరించుకుందన్నారు.
ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ప్రజలు విశ్వాసం వుంచడం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా 80 ఏళ్లు పైబడిన పౌరులు, వికలాంగులు రాబోయే ఎన్నికల్లో ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు.
ఓటర్లకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు కల్పించేందుకు 12డీ ఫారం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తుందని ఆయన తెలిపారు. అంతకంటే ముందే ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన వివరించారు.