జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మిషిన్(ఆర్‌వీఎం)పై డెమో ఇచ్చింది. ఆర్‌వీఎంల పనితీరును పార్టీలకు వివరించింది. ఇంటికి దూరంగా ఉండే వారు ఓటు హక్కు వినియోగించునేలా ఆర్వీఎంను రూపొందించారు.
ఈ డెమోకు గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. డెమో అనంతరం ఆర్వీఎంను కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. సమావేశంలో ఆర్‌వీఎంల పనితీరును పార్టీలకు ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు.
ఈ ఆర్వీఎంల సాయంతో ఇంటికి దూరంగా నివసిస్తున్న ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ కొత్త మెషిన్ల పనితీరు, ఎన్నికల విధానంలో తీసుకురావల్సిన మార్పులు, వలస కూలీలు ఓటు హక్కు వినియోగం, తదితరాలపై అభిప్రాయాలను ఈ నెల 31లోగా రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించింది.
ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు గాను అఖిల పక్ష సమావేశాన్ని నిన్న కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జేడీయూ, శివసేన ఉద్ధవ్ వర్గం, సీపీఐ(ఎం), నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీ, పీడీపీ, జేఎంఎం, వీసీకే, ఎన్సీపీ, ఆర్‌యూఎంఎల్, ఎస్పీ సహా 16 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ ఆర్‌వీఎం ప్రతిపాదనను వ్యతిరేకించాయి.