ఎకో గణేశ్ ! కోకో గణేశ్ !!
బెంగళూరు: చవితి పందిళ్లలో గణేశుడి రూపాలు వేనవేలు. ఒక్కో గణమూర్తి ఒక్కొక్క రూపందాల్చి చిద్విలాసంతో భక్తకోటిని ఆకర్షిస్తుంటాడు. హైదరాబాద్, ముంబై మహానగరాలలో గణేశ్ మండపాలలో గణేశుడి అవతరాలు చూడాలంటే నవరాత్రులూ చాలవు. బెంగళూరు, విశాఖ వంటి నగరాలు ఇప్పుడు వీటికి దీటుగా విభిన్న గణ మూర్తుల్ని మండపాల్లో నిలబెడుతున్నారు. గార్డెన్‌సిటీలో కొలువుదీరిన అలాంటి విగ్రహం ఒకటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 వేల కొబ్బరికాయలతో 30 అడుగుల ఎత్తున్న ఈ గణేశ్ విగ్రహాన్ని బెంగుళూరు నగరంలో వున్న పుట్టెంగల్లీ ప్రాంతంలో నిలబెట్టారు. 70 మంది భక్తులు 20 రోజుల పాటు దీనికోసం శ్రమించారు. 9 వేల కొబ్బరికాయలతో ఈ పర్యావరణ హిత గణేశ్ విగ్రహాన్ని తయారుచేశారు. కొబ్బరికాయలతో గణనాథుడిని తయారు చేయాలన్న వినూత్న ఆలోచన చేసిన ఇక్కడి భక్తులు 20 రకాల కూరగాయలతో దేవాలయాన్ని కూడా సుందరంగా అలంకరించారు.
పర్యావరణాన్ని కాపాడాలన్న ధ్యేయంతో ఈ గణేశుడిని తయారు చేశామని భక్తుడు మోహన్‌రాజు చెప్పారు. పాకశాస్త్ర నిపుణులైన వంటవారితో టన్ను హల్వాను తయారుచేసి గణేశుడి ముందు పెట్టామని మోహనరాజు చెప్పారు. వినాయక ఉత్సవాలు 5 రోజుల పాటు చేసిన తర్వాత గణేశుడిని తొలగించి కొబ్బరికాయలు, కూరగాయలు, హల్వాను భక్తులకు పంపిణీ చేస్తామని రాజు వివరించారు. అంటే, హైదరాబాద్ గణేశుడి లడ్డు తరహాలో బెంగళూరులో గణేశుడి హల్వా ఫేమస్ కాబోతోందన్న మాట !