వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థను ‘ఎకనమిక్ సర్వే’ అత్యద్భుతంగా చూపింది. 2023-24 సంవత్సరానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇది 7 శాతం ఉంటుందని మొదట భావించినప్పటికీ, 6.5 శాతం ఖాయమని పేర్కొంది. ఈ వృద్ధి రేటున ఇండియా ప్రపంచంలోనే అతి శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న ఎకానమీ గల దేశంగా కొనసాగుతుందని ఈ సర్వే వెల్లడించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఎకనమిక్ సర్వేను పార్లమెంటుకు సమర్పించారు
1922-23 ఫైనాన్షియల్ ఇయర్ లో 8.7 శాతం స్థూల దేశీయోత్పత్తి రేటు ఉండగలదని అంచనా వేశారు. కరోనా పాండమిక్ సమయంలో ఎకానమీ మందగించినప్పటికీ, ఆ తరువాత ఇది గణనీయంగా పుంజుకోగలిగిందని ఇందులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్త ఆర్ధిక వ్యవస్థల ఒడిదుడుకులు, రాజకీయ పరిణామాల ఆధారంగా జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం మేర ఉండే అవకాశాలున్నాయని ఇందులో వివరించారు.
ప్రైవేట్ కంజంప్షన్, (ప్రైవేటు భాగస్వామ్యం), హెచ్చు మూలధన వ్యయం, పటిష్టమైన కార్పొరేట్ బ్యాలన్స్ షీట్స్, చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలలో రుణ పరిమితి పెంపువంటి వాటితో బాటు వలస పోయిన కార్మికులు తిరిగి నగరాలకు చేరుకోవడం లాంటివి ఈ వృద్ధికి కారణమని పేర్కొన్నారు.
వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఓ మాదిరి హెచ్చుగా ఉన్నా అది ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ కి అవరోధం కాకపోవచ్చునని ఇందులో స్పష్టం చేశారు. అయితే ఈ సర్వేలో అక్కడక్కడా కాస్త నిరాశావాద పోకడలు కూడా కనిపించాయి. రుణ సంబంధ వ్యయాలు ఎక్కువగానే ఉండవచ్చునని, అలాగే ద్రవ్యోల్బణం దీర్ఘ కాలం కొనసాగవచ్చునన్న సంకేతాలను కూడా ఈ సర్వే ఇచ్చింది. ప్రస్తుత అకౌంట్ లోటు మరింత పెరగవచ్చునని, ప్రపంచ వ్యాప్త సరకుల ధరలు ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో మన రూపాయిపై ఒత్తిడి పెరగవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే ఇండియా వద్ద తగినన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, రూపాయిలో హయ్యర్ వోలటైలిటీ ని మేనేజ్ చేసేందుకు ఫారెక్స్ మార్కెట్ లో వీటిని వినియోగించుకోవచ్చునని వివరించారు.