కరోనా సమయంలో భారత్ లో ఆర్థిక అసమానతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఓవైపు పేదలు ఈ మహమ్మారి వలన మరింత పేదరికంలోకి కూరుకుపోతే.. ధనవంతులు మాత్రం బాగా సంపాదించారని ఎన్జీవో( NGO)ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదికలో తేలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 సందర్భంగా ఎన్జీవో( NGO)ఆక్స్‌ఫామ్ ఇండియా వార్షిక అసమానత సర్వేను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2021లో 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 10% సంపన్నుల వద్ద దేశ సంపదలో 45% ఉంది. అదే సమయంలో, దేశంలోని 50% పేద జనాభా వద్ద కేవలం 6% సంపద మాత్రమే ఉంది. భారతదేశంలోని టాప్-10% సంపన్నులపై 1% అదనపు పన్ను విధిస్తే.. వచ్చే డబ్బుతో 17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను అదనంగా పొందుతుందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దేశంలోని 98 సంపన్న కుటుంబాలపై 1% అదనపు పన్ను విధిస్తే, ఆ డబ్బుతో వచ్చే ఏడేళ్లపాటు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని తేల్చింది.
కరోనా కాలంలో భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రెట్టింపు అయినట్టు ఈ నివేదిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని అన్ని స్కూల్స్, కాలేజీలను రాబోయే 25 సంవత్సరాల పాటు నిర్వహించగలిగేంత సంపదను టాప్ 10 మంది దగ్గరే పోగుబడి ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక చెబుతోంది. ఈ పదిమంది ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు అంటే 7.4 కోట్లు ఖర్చు చేసినా, వారి సంపద ఖర్చు చేయడానికి 84 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు, దేశంలోని ధనవంతులపై సంపద పన్ను విధిస్తే, అప్పుడు 78.3 బిలియన్ డాలర్లు, అంటే 5.8 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఈ డబ్బుతో ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ 271% పెరగవచ్చు.
కరోనా కాలంలో 28% మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో వారి మొత్తం సంపాదన మూడింట రెండు వంతులు తగ్గింది. మహిళల స్థితిగతులకు సంబంధించి, 2021 బడ్జెట్‌లో, ప్రభుత్వం మహిళా .. శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు మాత్రమే ఖర్చు చేసిందని, ఇది భారతదేశంలోని దిగువ-10 మిలియనీర్ల మొత్తం సంపదలో సగం కూడా ఉండదని ఈ నివేదికలో పేర్కొన్నారు.