– సమీప భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం!
– అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదంటూ రాష్ట్రాల ఎదురుదాడి
– ఆర్థిక శాఖ తాత్సార ధోరణిపై కాగ్ లేఖ
– ప్రభుత్వాలకు రోజు వారీ ఖర్చులకూ కష్టాలే!
‘అప్పులు చేస్తాం..కానీ వివరాలు చెప్పం’ అన్న రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలకు ఓ వైపున భారీ ఆదాయాలు వస్తున్నా మరో వైపున దొరికిన కాడికి అప్పులు చేస్తూ రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు వారి ఖర్చులతో పాటు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కష్టతరమయ్యే పరిస్థితులు సమీప భవిష్యత్తులో రావొచ్చని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులు గురించిన వివరాలు తెలపడం లేదని కేంద్రం చెప్తోంది. అయితే, కేంద్రం మరిన్ని అప్పులు చేయడానికి అనుమతి ఇవ్వడం లేదని కేంద్రంపైన రాష్ట్రాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వైఖరిని తప్పుబడుతూ తాజాగా కాగ్ మరోసారి లేఖ రాసినట్లు సమాచారం.
సాధారణంగా ప్రతీ నెల ఆర్థిక శాఖ అధికారులు తమ రాష్ట్ర ఆర్థిక లావాదేవీల వివరాలను అకౌంటెంట్ జనరల్(ఏజీ) ఆఫీసుకు పంపించాలి. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అధికారులు ఆ లెక్కల వివరాలు ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక ఏపీకి సంబంధించి ఫిబ్రవరి నెల వరకు నెలవారీ వివరాలు ఇచ్చినప్పటికీ, మార్చి లెక్కలు మాత్రం ఇంకా రాలేదు.
ఇక ఏజీ కార్యాలయం నుంచి ప్రతీ నెల లెక్కలు సిద్ధం చేసి వాటిని ఆర్థిక శాఖకు పంపుతుంది. కాగా, ఆ లెక్కలకు, ఏజీ కార్యాలయ లెక్కలకు భారీ తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాగ్ కార్యాలయానికి రాష్ట్రాలు లెక్కల సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తు్న్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి అని సమాచారం. సొంత ఆదాయం కన్న ఖర్చు చేసిన వ్యయం భారీగా ఉన్నట్లు ఏజీ లెక్కల్లో తేలుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలు, సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల ద్వారా పొందిన రుణాల లెక్కలు ఆర్థిక శాఖ చెప్పడం లేదని కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆరోపిస్తోంది. మార్చి లెక్కలపై ఆర్థిక శాఖ తాత్సార ధోరణి కొనసాగిస్తోందని సమాచారం. ఈ విషయమై కాగ్ లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది.