దర్యాప్తు సంస్థలతో కేంద్రం ప్రతిపక్షాలను వేధిస్తోందని ఎప్పటినుంచో ఉన్న ఆరోపణలు. అప్పుడప్పుడు ఏకకాలంలో జరిగే సోదాలను బట్టి విపక్ష నేతలు ఇలా విమర్శలు చేస్తుంటారు. తాజాగా కాంగ్రెస్, శివసేన నేతలపై పడ్డాయి దర్యాప్తు సంస్థలు. ముందుగా కాంగ్రెస్ నేతల విషయానికొస్తే.. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీపై పలు కేసులు నమోదు చేసింది సీబీఐ.
గురువారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో కార్తీని విచారించారు అధికారులు. అయితే.. కరెక్ట్ గా అదే సమయంలో 34వ నేషనల్ గేమ్స్ కుంభకోణానికి సంబంధించి జార్ఖండ్ కాంగ్రెస్ నేత బంధు టిక్రే నివాసంలో సోదాలు జరిపింది సీబీఐ. క్రీడా శాఖ మంత్రిగా సేవలు అందించిన టిక్రే.. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో టిక్రేను ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
ఇక మహారాష్ట్రలో ఈడీ దాడులు అధికార పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్ ఆస్తులపై దాడులు చేసింది. ముంబైలోని పరాబ్ అధికార నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పుణెలోని మరికొన్ని చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది.
మరోవైపు గుజరాత్ లో సుమారు 35 నుంచి 40 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఏసియన్ గ్రానిటో ఇండియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో రెయిడ్స్ నిర్వహించారు అధికారులు.