వ్యవసాయ ఆస్తిని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు మాధవ్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ మేరకు నిందితున్ని అరెస్టు చేసినట్టు ఈడీ వెల్లడించింది.
నిందితున్ని న్యాయస్థానం ముందు ఈడీ హాజరు పరిచింది. దీంతో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. నిందితుడు మాధవ్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి ఓ వ్యవసాయ ఆస్తికి సంబంధించి అసలు యజమానుల సంతకాలను, వేలిముద్రలను ఫోర్జరీ చేసినట్టు ఈడీ విచారణలో తేలింది.
వాటితో నలికి డాక్యుమెంట్లను సృష్టించి ఆ వ్యవసాయ ఆస్తిని అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో నిందితుడు రూ. 80లక్షలను పొందినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడికి కోర్టు గతంలో సమన్లు పంపింది.
కానీ కోర్టు సమన్లకు స్పందించకపోవడం, విచారణకు పలు మార్లు గైర్హాజరు కావడం లాంటివి చేశాడు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచాలంటూ ఈడీకి నాన్ బెయిలబుల్ వారంట్ ఆదేశాలు ఇచ్చింది.