ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడు. బడ్డీ రిటైల్ డైరెక్టర్ గా ఉన్నాడు. అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు సన్నిహిత సహచరులని ఈడీ తెలిపింది. వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించారని అంటోంది.
సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లలో 9వ నిందితుడిగా అమిత్ ఆరోరా ఉన్నాడు. నవంబర్ 26న ఈ స్కాంపై ఈడీ 3 వేల పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులపై అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తాజా అరెస్ట్ తో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుంది ఈడీ.
మరోవైపు లిక్కర్ స్కాంపై సీబీఐ కూడా ఛార్జిషీట్ దాఖలు చేసింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వ్యక్తులు ఈ స్కాంలో ఉన్నారు. అధికార పార్టీల నేతలతో వీరికి లింకులు ఉండటంతో.. ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.