పెద్ద మనుషులని చలామణీ అయ్యే చాలామందిలో ఏదో ఒక క్రైమ్ కహానీ ఉంటుంది. సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంటుంది. ఘన్ శ్యాందాస్ అండ్ జ్యువెల్స్ యజమాని సంజయ్ అగర్వాల్ కూడా అంతే. ఇప్పటికే కోల్ కత్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న ఈ వ్యాపారవేత్తను మరో కేసులో అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ అబిడ్స్ లోని ఎస్బీఐ బ్యాంకులో రూ.67కోట్ల రుణం తీసుకున్నాడు సంజయ్ అగర్వాల్. ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు అతడ్ని డీఫాల్టర్ గా తేల్చింది. తర్వాత అతను సమర్పించిన పత్రాలు చెక్ చేయగా పెద్ద విషయమే బయటపడింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణం తీసుకున్నట్లు తేలింది. దీంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది.
విచిత్రం ఏంటంటే బ్యాంకు అధికారులు చర్యలు తీసుకునే లోపే అబిడ్స్ లోని ఎస్బీఐ బ్రాంచ్ లో ఉన్న తమ బంగారాన్ని సంజయ్ కుటుంబసభ్యులు తీసేసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే అక్రమ బంగారం విషయంలో కోల్ కతా అధికారులు సంజయ్ ను అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న అతడ్ని పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
అక్రమంగా సంపాదించిన సొమ్మంతా భార్య, సోదరులు, ఉద్యోగుల పేరిట ఉన్న డొల్ల కంపెనీలకు సంజయ్ బదిలీ చేసినట్లు తెలుసుకున్నారు అధికారులు. మూడేళ్ల క్రితం సంజయ్.. అతని కుమారుడు ప్రీత్ అగర్వాల్ పై కోల్కతాలో కేసు నమోదైంది.