కేరళలో పేదవారి భూములకే ఎసరు పెట్టి అవినీతికి పాల్పడిన మాజీ అధికారి ఎం. శివశంకర్ ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సీఎం పినరయి విజయన్ కి గతంలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా వ్యవహరించిన ఈయనను ‘లైఫ్ మిషన్ స్కామ్’ లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి ముందు మూడు రోజులపాటు అధికారులు శివశంకర్ ని విచారించారు. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన ప్రాజెక్టుల్లో లైఫ్ మిషన్ ప్రాజెక్టు కూడా ఒకటి.
ఈ పథకం కింద రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు మంజూరు చేస్తారు. ముఖ్యంగా త్రిసూర్ లోని వడక్కన్ చెర్రీ ప్రాంతంలో 140 పేద కుటుంబాలకు రూ. 14.50 కోట్ల వ్యయంతో ఇళ్ళు కట్టించి ఇవ్వాలన్నది ప్లాన్. యుఏఈ కాన్సులేట్ ద్వారా రెడ్ క్రెసెంట్ అనే సంస్థ రూ. 20 కోట్లను విడుదల చేయగా అందులో ఈ మొత్తాన్ని ఈ పథకం కింద వినియోగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును ఓ సంస్థకు అప్పగించగా ఇందులో అవినీతి చోటు చేసుకుంది. శివశంకర్ సహా మరికొందరికి రూ. 4.48 కోట్ల వరకు ముడుపులు చెలించాల్సి వచ్చిందని ఆ సంస్థ ఎండీ సంతోష్ ఈపెన్ తెలిపారు. దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కూడా శివశంకర్ 2020 లో అరెస్టయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ యవ్వారం ఈ కేసులోనూ బయటపడింది. ఆమె బ్యాంక్ లాకర్ నుంచి కోటి రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శివశంకర్ ని ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు.