తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు గురువారం కూడా విచారించారు. అయితే.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. మద్యం పాలసీ కేసులో జరిగిన అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కూడా సిసోడియాపై నమోదై ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను మూడు రోజులు విచారించారు.
ఈ కేసులో ఈనెల 7 నుంచి ఆయన్ను ప్రశ్నించిన అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. జైల్లో ఆయనను ఇంటరాగేట్ చేసేందుకు అధికారులు స్థానిక కోర్టు నుంచి అనుమతిని పొందారు. లోగడ తన సెల్ ఫోన్లను సిసోడియా మార్చడం, వాటిని ధ్వంసం చేయడం, లిక్కర్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలు వంటివాటిపై తిరిగి ఆయనను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ అరెస్ట్ పై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పిటిషన్ పై విచారణకు ముందు సిసోడియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని అన్నారు. దీంతో సిసోడియాను చాలా కాలం పాటు తప్పుడు కేసులో జైల్లో ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తేలిపోయిందని మండిపడ్డారు.
మొదట సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందన్నారు. కానీ, ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని.. ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఆయనకు బెయిల్ వస్తుందని.. ఈడీ అరెస్టు చేసిందన్నారు.