బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. రిక్రూట్ మెంట్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను నిన్న అర్ధరాత్రి వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
అనంతరం ఈ రోజు ఉదయం ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన టీఎంసీ రెండో నేత కావడం గమనార్హం. అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి మంత్రి పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నుంచి ఈ ఏడాది జూలైలో భారీగా డబ్బును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పార్థముఖర్జీ ఈడీ అధికారులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే భట్టా చార్య ముడుపులు తీసుకున్నట్టు మంత్రి వాట్సాప్ చాట్ లో ఆధారాలు దొరికినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ఆయన్ని విచారించి అరెస్టు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుతం పాల్శిపారా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆయన్ని న్యాయస్థానం ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.