బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే పలువురు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని ఈ డాక్యుమెంటరీపై విమర్శలు చేశారు.
ముఖ్యంగా దేశంలో ఈ డాక్యుమెంటరీని ప్రమోట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీతో తమకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయన్నారు. కానీ భారత్‌పై బీబీసీ తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన తీరు సరిగా లేదని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు.
ప్రస్తుతం అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా(ఐటీ వింగ్) ఇంచార్జీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆ ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్వీట్ విషయంలో ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్ ను తొలగించాలని ఆయన్ని డిమాండ్ చేశారు.
కానీ ఆయన ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చివరకు ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. భారతీయ వ్యవస్థలపై బీబీసీ వెల్లడించిన అభిప్రాయాలు దేశ సార్వభౌమమత్వాన్ని దెబ్బతీసేదిగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భావ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న నేతలే ఇప్పుడు ట్వీట్‌ను తొలగించాలని తనపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. అది తనకు నచ్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వంతపాడేవారు, చెంచాలు ఎక్కువైనట్లు ఆయన ఆరోపించారు. అందుకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2002లో గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో బీబీసీ రెండు భాగాలతో డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆ డాక్యుమెంటరీని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దాంట్లో నిష్పాక్షికత లోపించినట్లు పేర్కొన్నది.