సర్వో మ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ కుంభకోణంలో రూ. 13.51 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ ఆస్తులన్నీ డైరెక్టర్లు పీ. చంద్రశేఖర్ రెడ్డి, ఏవీ రావుల బంధువుల, బినామీల పేరిట ఉన్నట్టు ఈడీ తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ.402 కోట్ల మేరకు మోసం చేశారనే ఆరోపణల మేరకు సర్వో మ్యాక్స్ ఇండియా, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లపై సీబీఐ గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్, బ్యాంక్ గ్యారెంటీలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్‌తో సహా బ్యాంకుల కన్సార్టియం నుండి ఎస్‌ఐపిఎల్ రుణాలను సంస్థ పొందిందని ఈడీ దర్యాప్తులో తేలింది.
ఆ రుణాలను పేర్కొన్న ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని, పైగా వాటిని దారి మళ్లించిందని, వాటిని తిరిగి చెల్లించలేదని ఈడీ పేర్కొంది. కంపెనీ తనకు సంబంధించిన షెల్ కంపెనీల పేరుతో ఎల్ సీలను జారీ చేసిందని, ఎలాంటి మెటీరియల్‌ను సరఫరా చేయకుండానే ఎల్ సీలను డిస్కౌంట్ చేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి మళ్లించిందని ఈడీ వెల్లడించింది.