కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఓ వైపున సీబీఐ అక్రమ వీసాల మంజూరు విషయమై విచారణ చేపడుతున్న క్రమంలోనే మరో వైపున ఈడీ కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఈ కేసును ఈడీ..సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే నమోదు చేసింది.
చైనీస్ వీసా కుంభకోణం కేసులో నిబంధనలు ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు ఇప్పించడంలో కార్తీ చిదంబరం సాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఈడీ..మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంపై సీబీఐ విచారణ చేపడుతోంది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఈ కుంభకోణం విషయమై కార్తీ చిదంబరంను అధికారులు విచారించనున్నారు.
రూ.50 లక్షలు తీసుకుని చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ఆరోపణ. కార్తీ తండ్రి చిదంబరం సెంట్రల్ మినస్టర్ గా ఉన్న టైంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ తేల్చింది. ఈ వ్యవహారంలో సీబీఐ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న భాస్కర రామన్‌నూ అదుపులోకి తీసుకుంది.