ఎన్‌ఫోర్స్ మెంట్ చీఫ్ ఎస్.కే మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. తాజాగా ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది నాటికి ఆయన ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.
2020లో మొదటిసారి ఆయన పదవీ కాలాన్ని ఏడాది వరకు పెంచారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల చీఫ్‌ల పదవీ కాలాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆర్డినెన్స్ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని ఈ ఏడాది నవంబర్ 18 వరకు కేంద్రం పెంచింది. ఆర్టినెన్స్ కు ముందు దర్యాప్తు సంస్థల చీఫ్ ల పదవీకాలం మూడేండ్లు ఉండగా, ఆ తర్వాత దాన్ని ఐదేండ్లకు పెంచారు. మొదటి సారి ఆయన పదవీ కాలాన్ని పెంచినప్పుడు ఆ ఉత్తర్వులపై కొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈడీ, సీబీఐలను ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రం ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందంటూ కాంగ్రెస్, టీఎంసీలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాయి.