మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి పలువురి ఇండ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలను నిర్వహించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
దాడుల్లో భాగంగా మొదట దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. హసీనా ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దావూద్ కు సంబంధించి ఓ రాజకీయ నేత ఇంట్లోనూ సోదాలు జరిపినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
‘ మేము ముంబై, పరిసర ప్రాంతాల్లో 10 చోట్ల దాడులు నిర్వహిస్తున్నాము. గతంలో నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నాము. ఓ ఆస్తి వ్యవహారానికి సంబంధించి విచారణను ముమ్మరం చేశాము. ఇందులో ఓ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు మేము అనుమానిస్తున్నాము” అని ఈడీ వర్గాలు తెలిపాయి.
గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసును రిజిష్టర్ చేసింది. కేసుకు సంబంధించి దావూద్ అనుచరుల, పలువురు రాజకీయ నాయకుల మనీ ట్రాన్సక్షన్ వివరాలను ఈడీ సేకరిస్తున్నట్టు సమాచారం.