సంచలనం సృష్టించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. తాజగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది.
ఈ కుంభకోణంలో ఇప్పటికే సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, బొయినపల్లి అభిషేక్ రావు లను విచారించి కీలక సమాచారం రాబట్టింది. వారి దగ్గర నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఈడీ మరికొన్ని చోట్ల సోదాలు చేస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరా ఇంట్లీ ఈడీ అధికారులు దాడులు చేశారు. లిక్కర్ కుంభకోణంతో సంబంధం వున్న ఉద్యోగుల నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఈ కేసులో అరెస్టైన అభిషేక్ రావు కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగించారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు ఆయన పీఏ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడుతారోనని టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు.