– స్కాంలో కవిత ఇష్యూ కంచికేనా?
– చార్జ్ షీట్లలో ఊసే తప్ప.. పస లేని వ్యవహారం
– ఆధారాలు సేకరించడంలో విఫలం
– తెలంగాణలో పట్టు కోసమే కేసు పనికొచ్చిందా?
– కాంగ్రెస్ అన్నట్టు మోడీతో దోస్తీ కుదిరిందా?
– చెప్పింది ఎంటి? చేస్తోంది ఎంటి?
– సీబీఐ 91 సీఆర్పీసీ విచారణ ఎప్పుడు?
– ఈడీ ఉచ్చులో ఇరుక్కునేది ఎక్కడ?
క్రైంబ్యూరో, తొలివెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కూతురు కవిత అంశం కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఢిల్లీ బీజేపీ నేతలు ఇవిగో ఆధారాలు అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఫండ్స్ ఇచ్చారనే ఆరోపణలతో హీట్ పెరిగింది. సీబీఐ అరెస్టులు, ఈడీ దర్యాప్తులతో ఊపందుకుంది. హైదరాబాద్ లో కవిత ఇంట్లో సీబీఐ విచారించింది. 91 సీఆర్పీసీ ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ సమకూర్చాలని ఆదేశించింది. కానీ, ఎప్పుడు? ఎలా? ఎంటి? అనేది బయటకు రావడం లేదు. 10 సెల్ ఫోన్స్ ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కాంకు సంబంధం ఉన్నవారు 100 ఫోన్స్ పగలగొట్టారని చార్జ్ షీట్లలో పేర్కొన్నారు. అయితే.. అవేమీ ఇప్పుడు చర్చకు రావడం లేదు. అంటే ఆధారాలు లేకపోవడమే కారణమా? దర్యాప్తు ఏజెన్సీలు తెలిసీ తెలియని ఇన్ఫర్మేషన్ తోనే కోర్టులో ప్రస్తావించారా? లేక జేబు సంస్ధలుగా విమర్శలు వినిస్తున్న సందర్భంలో రాజీ కుదిరిందా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈడీ చార్జ్ షీట్ లో సాక్షిగానే కవిత?
ఈడీకి దేశంలో ఏ ఏజెన్సీకి లేని పవర్స్ ఇచ్చారు. కానీ, కక్షపూరితంగానే విచారణ తప్ప.. కనికట్టును కనిపెట్టలేక పోతోందని ఇటీవలి కేసులను బట్టి అర్ధమవుతోంది. దేశంలో పలు కీలక కేసుల్లో చార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు ఉన్న ఉత్సాహం కోర్టు విచారణలో లేకపోవడంతో మరింత బలాన్ని చేకూర్చుతోంది. లిక్కర్ స్కాంలో రెండు చార్జ్ షీట్లలో మొత్తం 13,567 పేజీలు దాఖలు చేశారు. మొదటి దాంట్లో 28 సార్లు పేరు పేర్కొన్నా.. రెండో దాంట్లో నిందితురాలిగా చేర్చేంత బలమైన ఆధారాలు రాబట్టలేకపోయింది. దీంతో అడిషనల్ చార్జ్ షీట్ లో కూడా పేరు ప్రస్తావించడమే తప్ప.. బీజేపీ నేతలు ఆరోపించినట్లు ఎలాంటి చర్యలు కనిపించలేదు. అంటే, లిక్కర్ స్కాం జరిగింది అనడానికి ఆమె ఒక సాక్షిగానే ఉన్నట్టే. ఈ కేసులో ఏ1 గా ఉన్న సమీర్ మహేంద్రుతో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారని, హైదరాబాద్ లో అనేక మార్లు భేటీ అయ్యారని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కవిత తరఫున రామచంద్ర పిళ్లై అన్నీ దగ్గరుండి చూసుకున్నారని చెప్పారు. వైసీపీ ఎంపీ మాగుంట, కవిత, శరత్ లు కలిసి నిర్వహిస్తున్న సౌత్ గ్రూప్ నుండి రూ.100 కోట్ల ముడుపులు ఢిల్లీకి చేరాయని వివరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో సౌత్ గ్రూప్ యాజమాన్యం, అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు పలువురు అనేకమార్లు ఆప్ నేతలతో భేటీ అయ్యారని తెలిపారు. హోల్ సేల్, రిటైల్ ఉత్పత్తిదారులతో కుమ్మకై సిండికేట్ ను ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త దినేష్ అరోరా వాగ్మూలం ఆధారంగా కేసును వేగవంతం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, కవిత రోల్ ఎంత అనేది ఇప్పటికీ అర్థం కాని వ్యవహారమే. తెలంగాణలో పట్టుకోసమే, ముఖ్యమంత్రి కూతురుని ప్రచారంగా వాడుకున్నారనే ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా.. గాలి మాటలే..!
కాంగ్రెస్ ని తెలంగాణలో కిల్ చేసేందుకే బీజేపీ, టీఆర్ఎస్ లిక్కర్ డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ మొదట్నుంచి ఆరోపిస్తోంది. స్కాంలో ఉంటే అరెస్ట్ చేయాలి.. తిన్నదంతా కక్కించాలని ప్రెస్ మీట్లు పెట్టి మొత్తుకున్నారు హస్తం నేతలు. కానీ, దర్యాప్తు సంస్థలు ఆ దిశగా అడుగులు వేయలేదు. అంటే, పసలేని కేసును ప్రచారాస్త్రంగా వాడుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రపిళ్లై ఢిల్లీలో 7 జోన్లలో రిటైల్ లైసెన్స్ పొందారని, తద్వారా విజయ్ నాయర్ కు వంద కోట్ల ముడుపులు అందినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ముడుపులను హవాలా మార్గంలో ఢిల్లీకి తరలించారని తెలిపారు. ఈ కుంభకోణం వలన ప్రభుత్వానికి రూ.2,873 కోట్ల మేర నష్టం వచ్చినట్లు ఈడీ పేర్కొంది. ఇంత క్లియర్ గా అభియోగాలు మోపిన ఈడీకి ఆధారాలు దొరక్కపోవడం అంటే.. ఏం జరిగిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
సెంటిమెంటా..? సెటిల్మెంటా..?
కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు సెంటిమెంట్ పెరుగుతుందని ఓ బీజేపీ నేత అన్నారు. అయితే.. ఇది సెటిల్మెంటేమోనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుడే అంటూ జబ్బలు చరుచుకునే బీజేపీ నేతలకు సరైన ఆధారాలు దొరక్కపోగా.. పట్టుకోసం, ప్రచారం కోసం పాకులాడినట్లే కనిపిస్తోందని ప్రజలు సైతం గుసగుసలాడుకుంటున్నారు.