లైగర్ మూవీ పెట్టుబడులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ చిత్రం నిర్మాణ సమయంలో రూ.10 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించింది. ఈ విషయంలో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్, నిర్మాత ఛార్మీ కౌర్, హీరో విజయ్ దేవరకొండను విచారణ చేసింది. అలాగే పూరి కనెక్ట్ ఎల్ఎల్ఎల్పీకి సంబంధించిన రూ.30 నుంచి 40 కోట్ల ఆర్థిక లావాదేశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అలాగే పలు బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఈ డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించిన ఈడీ.. దర్యాప్తును ముమ్మరం చేసింది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్.. లైగర్ సినిమాకు తీసుకున్న మొత్తం గురించి ఈడీ ఆరా తీస్తోంది.
అయితే లైగర్ చిత్రానికి విజయ్ రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్నట్లు గుర్తించింది ఈడీ. అందులో మతలబు ఏముందో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధం ఉందా? అని కూపి లాగుతోంది ఈడీ.
కాగా నవంబర్ 17న దర్శకుడు పూరీ జగన్ తో పాటు నిర్మాత చార్మి కౌర్‌ను కూడా విచారించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ గా విచారించి అనేక విషయాలను రాబట్టారు. తాజాగా లైగర్ సినిమా హీరో విజయదేవరకొండను కూడా విచారించారు. విజయ్ పారితోషకం, ఏ విధంగా చెల్లింపులు జరిగాయనే విషయంలో కూడా అధికారులు ఆరా తీశారు. అదే విధంగా ఈ సినిమాలో నటించిన ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కు ఎంత మొత్తం చెల్లించారనే విషయం కూడా అధికారులు ఆరా తీశారు.