ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ శనివారం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత విషయంలో కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని న్యాయస్థానాన్ని కోరింది ఈడీ. దీంతో సుప్రీంకోర్టు కవిత తరపు న్యాయవాదితో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాత కవిత పిటిషన్ పై న్యాయ స్థానం తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ కేసులో మరో ట్విట్ చోటుచేసుకోబోతుంది.
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను ఈడీ ఆఫీసులో విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.
ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ పిలువగా.. కవిత విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.