ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టింది. 2014- 19 మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఈడీ భావిస్తుంది.
స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ లకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై ఈడీ వేగంపెంచింది.
పూణెకి చెందిన పలు కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు ఈడీ భావిస్తుంది.ఓఎస్‌డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్ కు నోటీసులు ఇచ్చింది. హైదరాబాదులోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు.
లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు కూడా చేశారు.