– 12 యాప్ప్ కు చెందిన రూ.105 కోట్లు సీజ్
– 233 బ్యాంకు ఖాతాలు నిలిపివేసిన ఈడీ
– ఇప్పటివరకు రూ.264 కోట్లు సీజ్
– రూ.4,430 కోట్ల రుణాలు
– కొద్ది నెలల్లోనే రూ.820 కోట్ల లాభాలు
– అత్యధిక మొత్తం చైనాకు దొడ్దిదారిన మళ్లింపు
– హైదరాబాద్ కేంద్రంగా భారీ దందా
లోన్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న 12 లోన్ యాప్స్ కు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోని రూ.105 కోట్లను సీజ్ చేశారు. ఇండి ట్రేడ్ ఫిన్ కార్ప్, అగ్లో ఫిన్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కుమ్మక్కయిన ఫిన్ టెక్ కంపెనీలకు చెందిన 233 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన తొలికేసు ఆధారంగా జరిపిన దర్యాప్తులో కళ్లు చెదిరే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఆన్ లైన్ లోన్ యాప్స్ బారిన పడి తెలుగురాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలమంది తీవ్రమైన మానసిక వేధింపులకు గురయ్యారు. న్యూడ్ వీడియోలు అంటూ వేధింపులు, ఇళ్లకొచ్చి బెదిరింపులకు పాల్పడటం మామూలైంది. ఈ క్రమంలో కేంద్ర సంస్ధలు ఈ లోన్ యాప్స్ మూలాలపై దృష్టి సారించారు.
లోన్ యాప్స్ క్రియేట్ చేసే వారికి ప్రాథమిక పెట్టుబడి చైనా నుంచే అందుతోంది. చాలా ఫిన్ టెక్ కంపెనీలు ఈ విధంగా చైనా నుంచి వస్తున్న పెట్టుబడుల ఆధారంగా పర్పనల్ రుణాలు ఇప్పిస్తామంటూ నాన్ బ్యాంకింగ్ రుణ సంస్ధలతో టై ఆప్ అవుతున్నాయి. వాస్తవానికి రుణ సంస్థలకు తాము సాంకేతిక సాయం మాత్రమే చేస్తామని చెప్పిన నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలు తెరవెనుక తామై అన్నీ నడిపిస్తున్నాయన్న విషయం ఈడీ విచారణలో వెల్లడైంది.
నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలు డిజిటల్ లోన్ యాప్స్ తయారు చేసి ఫిన్ టెక్ కంపెనీలకు అందించారు. కస్టమర్లకు రుణాలు ఇవ్వడం అంతా వీరు చెప్పినట్లే సాగింది. సోషల్ మీడియా డేటా ఆధారంగా కస్టమర్లకు వల విసిరేవారు. రుణం కోసం అడిగిన వారికి లాగిన్ అయి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అప్ డేట్ చేస్తే చాలు నిమిషాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు వేసేవారు. వారం నుంచి నెల రోజుల వ్యవధిలో రీ పేమెంట్ చేయాలి.. అలా కట్టని వారు అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. మరీ ఆలస్యం చేసే కస్టమర్లకు వేధింపులు మొదలయ్యేవి..
ఇలా హైదరాబాద్ నుంచే 233 బ్యాంకు ఖాతాల ద్వారా లోన్ యాప్స్.. రుణాలు ఇచ్చి వసూళ్లు చేసుకున్నాయి.. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన దందానే రూ.4,430 కోట్లు దాటింది. ఇందులో వీరి లాభం రూ.820 కోట్ల రూపాయలపైనే ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీన్ని నేరం చేయడం ద్వారా సంపాదించిన లాభంగా ఈడీ తమ డాక్యుమెంట్లలో పేర్కొంది.