ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేశ్ గుప్తా వరుసగా రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయన్ని అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ను మోసం చేశారన్న ఆరోపణలపై ఎంబీఎస్ జ్యుయెలర్స్ పై మొదట సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. ఆయనపై మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేసింది.
తనపై దర్యాప్తును నిలిపి వేయాలంటూ సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. మోసానికి పాల్పడిన తీరుపై ఇంకా పలు వివరాలు సేకరించాల్సి వుందని ఈడీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఆయన విచారణపై ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈడీ విచారణకు సహకరించాలంటూ ఆయనకు కోర్టు సూచించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్న ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీతో ఎంఓయూ కుదుర్చుకున్న లావాదేవీలపై ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించినట్టు సమాచారం. అతని బ్యాంకు ఖాతాలను కూడ అధికారులు తనిఖీ చేసినట్టుగా తెలిసింది.