ఈడీ పూర్తిగా స్వతంత్ర సంస్థ అని, ఆర్ధిక సంబంధ నేరాలను ఇది విచారిస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే ఈ సంస్థ అధికారులు దర్యాప్తును ప్రారంభిస్తారని అన్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉన్న ఆమె.. ఈ సంస్థ కున్న అధికార పరిధిమేరకు వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉన్న సందర్భాల్లో స్వతంత్రంగా దర్యాప్తు చేసే స్వేచ్చ ఈడీకి ఉందని వివరించారు.
కక్ష సాధింపు చర్యలకు దీన్ని వినియోగించుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. దీనివెనుక దురుద్దేశాలు ఉన్నాయనడం సరికాదన్నారు. ఈడీ తొలి దశలోనే రంగంలోకి దిగదని.. తమ వద్ద ఆధారాలు ఉన్నప్పుడే దర్యాప్తునకు దిగుతుందని ఆమె చెప్పారు. ఈ సంస్థ జరుపుతున్న దాడులు, సోదాల సందర్భంగా ఎంత నగదు లేక బంగారం, జువెల్లరీ ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారో మీడియా వెల్లడిస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
జీ -20 దేశాలు, వాటి ప్రాధాన్యతల గురించి ప్రస్తావిస్తూ.. ఈ గ్రూప్ లోని పలు సభ్యదేశాలతో తాము ద్వైపాక్షిక చర్చలు జరిపామని, ఎన్నో సవాళ్లు ఉన్న తరుణంలో ఇండియా ఈ గ్రూప్ కి అధ్యక్ష పదవిని చేబడుతున్నామని తెలిపారు. వచ్చే డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు ఇండియా ఈ హోదాలో కొనసాగనుంది.
ఇండియాలో డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ పడిపోయిన విషయాన్ని ప్రస్తావించగా భూ భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినందువల్లే ఇలా జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని చక్కదిదేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ విషయంలో ఇండియా పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. ద్రవ్య లోటు పెరుగుతోందని, ఇది ప్రతి చోటా ఉందని పేర్కొన్నారు.