ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక అరెస్టులు కొనసాగుతున్నాయి. బుధవారం ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా.. గురువారం చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే జోషీని అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముడుపులుగా అందిన డబ్బులను గోవా ఎన్నికలకు ఆప్ ఉపయోగించిందని ఈడీ అంటోంది. ఈ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును గోవా ఎన్నికలలో ఆప్ తరఫున రాజేష్ జోషి ఖర్చు పెట్టారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ స్కాం అనుబంధ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.
ఈ కేసులో ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. బుధవారం ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మద్యం విధానం రూపకల్పన సమయంలో వ్యాపార లావాదేవీలు జరపడంతో పాటు.. రాజకీయ పార్టీకి చెందిన వారితో డబ్బు లావాదేవీల్లో భాగస్వామ్యంగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.