ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈ రోజు రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఎదుట ఈడీ అధికారులు హాజరు పరిచారు. సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేర్చింది. తాజాగా ఆమెపై ఈడీ కీలక అభియోగాలు మోపింది.
లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను గత నెల 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆయన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా ఆయనకు రిమాండ్ విధించిది. తీహార్ జైలులో ఉన్న ఆయన్ని నిన్న ఈడీ అరెస్టు చేసింది. సిసోడియాను ఈ రోజు న్యాయస్థానంలో హాజరు పరిచిన ఈడీ పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అడిగింది.
ఈ క్రమంలో ఈ నెల 17 వరకు సిసోడియాను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగిందని రిపోర్టులో ఈడీ పేర్కొంది.
దీనికి సంబంధించిన కీలకమైన చర్చలు, ఒప్పందాలన్నీ ఐటీసీ కోహినూర్‌లో జరిగాయని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారం కోసం నార్త్ గ్రూపునకు చెందిన దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు రప్పించిందని తెలిపింది. ఆప్ నేతలకు సౌత్ గ్రూపు రూ. 100కోట్లు ఇచ్చినట్టు నివేదికలో చెప్పింది.
ఈ కేసులో ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఈ కేసులో విజయ్ నాయర్, సిసోడియా, కవితతో పాటు పలువురు కుట్రలు చేశారని వాదించారు. ఢిల్లీలో 30శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూపునకే అప్పగించారని ఆరోపించింది. కవిత విజయ్ నాయర్ ను కలిసి పాలసీ ఎలా ఉందో చెప్పాలని అడిగినట్టు చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్, సిసోడియా తరపున విజయ్ నాయర్ వ్యవహారం నడిపించారన్నారు. పాలసీ విధానాలకు సంబంధించి జీఓఎం నివేదిక కన్నా రెండు రోజుల ముందే బుచ్చిబాబు కవితకు అందజేశారన్నారు. ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్స్‌ను ఇప్పించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని, ఈ కంపెనీకి జెట్ స్పీడుతో దరఖాస్తు క్లియర్ చేయించారన్నారు.