ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కవిత విచారణకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారగా.. ఇంకోవైపు కేసులో మరో కీలక అడుగు పడింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది.
ఈ కేసులో మొదట్నుంచి శ్రీనివాసులురెడ్డి హస్తంపై దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఛార్జ్ షీట్లలో కూడా ఆయన పేరును ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నారు శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి.
మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది. గురువారం ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమె వెళ్లలేదు. తన తరఫన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు. తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ పంపారు కవిత. ఆ లేఖను పరిశీలించిన అధికారులు ఈనెల 20న తమ ముందు హాజరు కావాల్సిందిగా మరోమారు నోటీసులు జారీ చేశారు.
ఇటు ఇదే కేసులో అరెస్ట్ అయిన.. రామచంద్ర పిళ్లై కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని కోరుతూ.. కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఆమెతోపాటు పిళ్లైని విచారించాల్సి ఉందని తెలిపింది ఈడీ. ఈడీ వాదన తర్వాత కవిత విచారణకు రాలేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. దానికి రాలేదని సమాధానం చెప్పింది ఈడీ. ఆమె రానందు వల్లే పిళ్లై కస్టడీ పొడించాలని కోరింది ఈడీ.