ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆయన్ని 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. అంతకు మాగుంట రెడ్డిని ఈడీ కస్టడీకి ఇవ్వవద్దంటూ ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై ఈడీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించ వచ్చంటూ ఆయన పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మాగుంట రాఘవ రెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు.
రాఘవరెడ్డిని కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. ప్రతి రోజూ రెండు గంటల పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. కానీ ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు మాత్రం కోర్టు అభ్యంతరరం వ్యక్తం చేసింది.
అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు కూడా కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇటీవల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు కావడం గమనార్హం. అంతకు ముందు ఈ కేసులో అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేసింది. కేసులో మరింత సమాచారం కోసం బుచ్చిబాబును కస్టడీకి ఇవ్వాలని సీ అధికారులు కోర్టును అభ్యర్థించారు.
లిక్కర్ స్కామ్‌లో బుచ్చిబాబు భాగస్వామి అని సీబీఐ ఆరోపించింది. సహ నిందితులతో కలిసి పలుమార్లు ఆయన భేటీల్లో పాల్గొన్నారంటూ న్యాయస్థానానికి వివరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే వ్యూహరచన జరిగిందని ఈడీ పేర్కొంది.
ఇది ఇలా వుంటే ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ ఆమె పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని అందులో ఈడీ పేర్కొంది.