గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. కోట్ల రూపాయల నిధుల మళ్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఈనెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 53 చోట్ల స్థిరాస్తులను గుర్తించారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసులో భాగంగా పీఎమ్‌ఎల్‌ఏ ఈడీ కేసు నమోదు చేసింది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారని ఈడీ గుర్తించింది. అలాగే కరోనా సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని పేర్కొంది. కోవిడ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని సొసైటీ ఖాతాల్లో చూపించలేదని తెలిపింది. అంతేకాకుండా మెడికల్ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారని వివరించింది.
ఇలా పలు రకాలుగా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. ఎన్నారై సొసైటీ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించామని పేర్కొంది. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిగిందని.. సొసైటీ సభ్యులు ఎన్నారై అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారని వివరించింది.
మెడికల్ కాలేజీ విక్రయ వ్యవహారం, కరోనా కాలంలో నిధుల గోల్ మాల్, తమవారికే టెండర్స్ పనుల అప్పగింతలపై కేసులు ఉన్నాయి. దీంతో రత్నా ఇన్ఫ్రాకి సివిల్ వర్క్స్ తో పాటు పలు పనులకు 33 కోట్లకు గాను అగ్రిమెంట్ చేసుకున్నారు. చేసిన పనులకు గాను 4 కోట్లు రిలీజ్ చేశారు. కాలేజీలో అధిపత్యం పోరు పెరగడంతో మధ్యలోనే ఆపివేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు సొంత మీడియాలో వార్తలు వడ్డించే ప్రయత్నాలు కూడా జరిగాయి.