తీహార్ జైల్లోఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు గురువారం కూడా విచారించారు. ఆయనను వారు ప్రశ్నించడం ఇది రెండో సారి. మద్యం పాలసీ కేసులో జరిగిన అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసు కూడా సిసోడియాపై నమోదై ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా ఈ నెల 7 న మొదటిసారిగా 5 గంటలపాటు ఆయనను ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
జైల్లో ఆయనను ఇంటరాగేట్ చేసేందుకు అధికారులు స్థానిక కోర్టు నుంచి అనుమతిని పొందారు. లోగడ తన సెల్ ఫోన్లను సిసోడియా మార్చడం, వాటిని ధ్వంసం చేయడం, లిక్కర్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలు వంటివాటిపై తిరిగి ఆయనను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక తీహార్ జైల్లో సిసోడియాకు ప్రాణహాని ఉందన్న ఆప్ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, తమ పార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్ గురించిన అనేక రహస్యాలు సిసోడియాకు తెలుసునని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు.
తన సన్నిహితుడైన మనీష్ సిసోడియాకు జైల్లో హాని ఉందని కేజ్రీవాల్ ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించిన ఆయన.. కేజ్రీవాలే ఈ సన్నిహితునిపై కుట్ర చేస్తున్నారా అని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి సిసోడియాకు ప్రాణ హాని ఉందనడం అర్థరహితమని పేర్కొన్న తివారీ.. జైల్లో ఆయనకు అత్యంత భద్రత కల్పించాలని జైలు అధికారులను కోరారు.