‘వజీర్ఎక్స్ (జాన్మై ల్యాబ్స్ ప్రై.లిమిటెడ్)’కంపెని నిర్వహకుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కంపెనీకి చెందిన హైదరాబాద్ లోని నిర్వాహకుల ఇండ్లలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించినట్టు తెలిపింది. సోదాల సమయంలో రూ. వంద కోట్లను జప్తు చేసినట్టు పేర్కొంది.
చైనా బెట్టింగ్ యాప్‌ల దందాలో రూపాయల్లో వచ్చిన డబ్బును క్రిప్టో కరెన్సీగా కంపెనీ మార్చింది. ఆ తర్వాత దాన్ని కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయిన ‘బైనాన్స్ వాలెట్ల’లోకి పంపినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వజీర్ఎక్స్ కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ గుర్తించింది.
ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు ఈడీ గతంలోనే గుర్తించింది. ఈ ఎక్చేంజి ద్వారా మొత్తం సుమారు. రూ.2,790.74 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఇందులో నమోదైన ఖాతాల్లోకి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల ద్వారా రూ. 880 కోట్లు, భారత్ నుంచి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల్లోకి రూ.1400 కోట్లు జమైనట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.
ఆడిట్ లేదా దర్యాప్తు చేసేందుకు దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు బ్లాక్‌చెయిన్‌లో అందుబాటులో లేవని తెలిసింది. ఈ క్రమంలో ఎక్స్ఛేంజ్ నిర్వాహకులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని, తద్వారా భారత్ నుంచి విదేశాలకు ఆర్థిక లావాదేవీలు సాగించారని ఈడీ అనుమానిస్తోంది.