– ఐటీ దాడుల తర్వాత ఈడీ ఫోకస్
– రియల్ ఎస్టేట్ సొమ్ముతో అక్రమాలు?
– ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పై తొలివెలుగు కథనాలు
– 30 కథనాలతో స్కాంని బయటపెట్టిన క్రైంబ్యూరో
– ఈడీ ఎంట్రీతో ఏం జరగబోతోంది..?
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఐటీ దాడులతో ఫినిక్స్ అక్రమ సొమ్ము బయటపడింది. ఆ సొమ్ము ఎలా తరలించారో ఇప్పుడు ఈడీ తేల్చబోతోంది. ఫినిక్స్ సిస్టర్ సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే.. ఫల్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలకు దిగింది. ఏకకాలంలో 15 బృందాలు ఈ తనీఖీలు చేపట్టాయి. ఫినిక్స్ కంపెనీ డైరెక్టర్స్ ని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ సోదాల నేపథ్యంలో ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫినిక్స్ అక్రమాలపై తొలివెలుగు క్రైంబ్యూరో 30 ఎక్స్ క్లూజివ్ కథనాలు ప్రచురించింది. పక్కా ఆధారాలతో స్టోరీలు ఇచ్చింది. దీంతో ఐటీ శాఖ సోదాలు నిర్వహించి లెక్కలు తేల్చింది. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలకు దిగారు.
ఏక కాలంలో 15 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, పఠాన్ చెరువు, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఈ ఫార్మా కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న గోపీకృష్ణ.. ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ కు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
గోపికృష్ణ మొత్తం 19 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నట్లు సమాచారం. అలాగే, మరో 15 కంపెనీలకు అసోసియేట్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఐటీ సోదాలు.. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో.. మనీలాండరింగ్ కోణాలు బయటపడతాయో లేదో చూడాలి.