ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ దూకుడుగా ముందుకెవళ్తున్నాయి. ఓవైపు సోదాలు జరుపుతూ.. ఇంకోవైపు పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. కేసులో ఏ1గా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్, గుంటూరు, విజయవాడలలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 10 చోట్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ తనిఖీలు దేనికో బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అధికారులు.. అయితే.. లిక్కర్ స్కాం కు సంబంధించే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
మరోవైపు సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని విచారిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ ఎండీని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు.. గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నెల్లూరులోని మాగుంట కార్యాలయం, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను మాగుంట ఖండించారు.