ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోయాలుక్కాస్ వార్తల్లో నిలిచింది. బుధవారం జోయాలుక్కాస్ జ్యువెలరీపై ఈడీ దాడులు జరగడం తీవ్ర సంచలనం రేపింది. దుబాయ్ కి భారీగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై జోయాలుక్కాస్ అధినేత వర్గీస్ అలుకాస్ నివాసంలో ఈడీ సోదాలు చేసింది. రూ.300 కోట్ల మేర నిధులు విదేశాలకు మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఏకకాలంలో కార్పొరేట్ ఆఫీస్ తో పాటు సంస్థ అధినేత ఇంట్లోనూ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా గత ఏడాదే IPOకి వస్తున్నట్టు ప్రకటించింది ఈ సంస్థ. ఈ ఐపీఓ ద్వారా 2 వేల 300 కోట్లను సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రాసెస్ కొలిక్కి తెచ్చి డేట్ కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఐపీఓ వద్దని నిర్ణయం తీసుకుంది. మంగళవారం సెబీకి కూడా దీనిపై సమాచారం అందించింది. ఐపీఓ ఉపసంహరించుకోవాడానికి కారణాలు ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఐపీవోకు వెళ్లాలనుకున్న ఆలోచనను విరమించుకున్న మరుసటి రోజే జోయాలుక్కాస్ సంస్థపై ఈడీ దాడులు జరగడం సంచలనంగా మారింది. జాయ్ వర్గీస్ అలుక్కాస్ ప్రమోటర్ గా ఉన్న ఈ సంస్థలో హవాలా ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివారాలపై ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆరా తీస్తుండటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కేరళకు చెందిన వ్యాపారవేత్త ఈ జోయాలుక్కాస్ జ్యువెలరీకి ఓనర్. దేశవ్యాప్తంగా 68 బ్రాంచ్ లు ఉన్నాయి. జ్యువెలరీ బిజినెస్ లో దేశంలోనే రెండో ప్లేస్‌లో ఉంది జోయాలుక్కాస్.