ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బంధువుల ఇండ్లలో ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఏక కాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేసింది. లాలూ కూతురు రోహిణీ ఆచార్య నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఆమెతో పాటు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ దాడులు జరిపింది. పాట్నాలో ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబూ డోజానా నివాసంలో తనిఖీలు చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల రోహిణీ ఆచార్య నివాసంలో లాలూను సీబీఐ ప్రశ్నించింది.
తన తండ్రిని సీబీఐ వేధిస్తోందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సీబీఐ చర్యల వల్ల తమ తండ్రికి ఏదైనా ఇబ్బంది కలిగితే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. తాము ఢిల్లీ మొత్తాన్ని షేక్ చేస్తామంటూ ఆమె హెచ్చరించారు. ఆమె ట్వీట్ చేసిన రెండు రోజుల్లోనే ఈడీ దాడులు జరగడం గమనార్హం.
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవీని పాట్నాలోని ఆమె నివాసంలో సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత మంగళ వారం ఇదే కేసులో లాలూను ఆయన కుమార్తె నివాసంలో ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం ప్రశ్నించింది. సీబీఐ కేసును పరిగణనలోకి తీసుకొని ఈసీఐఆర్ దాఖలు చేసిన తర్వాత మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.