ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రోజు లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ మరోసారి తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. మూడు రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ లోని 35 ప్రాంతాలు, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారు జాము నుంచే ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇటు హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు మొత్తం 105కుపైగా ఎక్కువ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో మద్యం వ్యాపారి, ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమసాగర్ గండ్ర, అభిషేక్ రావు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీలు సోదాలు నిర్వహించింది.