అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ సోదరుల ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జేసీ సోదరుల ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఏక కాలంలో వారికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండే సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.
అయితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే.. ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. రాజకీయాలతో పాటు బిజినెస్ లో ప్రసిద్ధి గాంచిన దివాకర్ రెడ్డి.. ఆయన పేరుతో ట్రావెల్స్ బస్సుల్ని కూడా నడుపుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలనే ప్రభుత్వం వారి వ్యాపారాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు జేపీ బ్రదర్స్.