విజయవాడలోని ఎన్ఐఆర్ ఆసుపత్రిలో జరుగుతున్న ఈడీ సోదాలు ముగిశాయి. అనంతరం విజయవాడ ఇన్ కంట్యాక్స్ ఆఫీసుకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇన్ కంట్యాక్స్ అధికారులతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ , అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రుల ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అయితే కొంత కాలంగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యం కడుతున్న ఇన్ కంట్యాక్స్, ఆదాయ పత్రాలను ఈడీ అధికారులు సేకరించారు. అలాగే పలు రికార్డులను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
అక్కినేని ఉమెన్స్ హాస్పటల్ లోనూ..సోదాలు జరిగాయి. రెండు ఆస్పత్రుల్లో పలు రికార్డులు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం.
ఇక ఈ రెండు ఆసుపత్రుల డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. దాదాపుగా వంద కోట్ల వరకు ఆర్థిక వ్యవహారాలు జరిగినట్టుగా ఈ సోదాల్లో ఈడీ అధికారులు గుర్తించారు.